హిజాబ్ లేకుండా పాట పాడిందని 74 కొరడా దెబ్బలు.. ఇరాన్‌లో సంచలన తీర్పు!

  • ఇరాన్ గాయని అహ్మదీకి  శిక్ష
  • యూట్యూబ్ సంగీత కార్యక్రమంలో పాల్గొనడమే కారణం
  • ఆమెతో పాటు బృందంలోని సభ్యులకూ శిక్ష
  • రెండేళ్ల పాటు విదేశీ ప్రయాణాలపై నిషేధం
  • ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆంక్షలు
  • ఇరాన్‌లో మహిళల స్వేచ్ఛపై మరోసారి చర్చ
ఒక పాట.. ఒక యూట్యూబ్ వీడియో.. ఫలితం 74 కొరడా దెబ్బల శిక్ష. ఇరాన్‌కు చెందిన గాయని పరాస్తూ అహ్మదీపై వచ్చిన తాజా తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. హిజాబ్ ధరించకుండా ఆన్‌లైన్ సంగీత కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆమెతో పాటు ప్రొడక్షన్ బృందంలోని సభ్యులకు కఠిన శిక్షలు విధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

2024లో అహ్మదీ తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ సంగీత కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ కార్యక్రమంలో ఆమె హిజాబ్ లేకుండా, చేతులు పూర్తిగా కనిపించే నల్లటి దుస్తుల్లో పాటలు పాడింది. పురుష సంగీతకారులతో కలిసి చేసిన ఈ ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షలాది మంది వీడియోను వీక్షించారు.

మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్‌లోని ఖోమ్ ప్రావిన్స్ కోర్టు అహ్మది బృందానికి 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది. అంతేకాదు రెండేళ్ల పాటు విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించింది. మ్యూజిక్‌ ప్రోగ్రామ్స్‌ సహా ఇతర కళలకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనడంపైనా రెండేళ్ల నిషేధం విధించినట్లు సమాచారం. అసభ్యకర, అనైతిక కంటెంట్‌ను ప్రచారం చేశారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ తీర్పుపై మానవ హక్కుల సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం పాట పాడినందుకు, హిజాబ్ ధరించలేదనే కారణంతో ఇలాంటి శిక్షలు విధించడం మానవ హక్కుల ఉల్లంఘన అని విమర్శిస్తున్నాయి. మహిళల స్వేచ్ఛను అణచివేసే చర్యలకు ఇది మరో ఉదాహరణగా అభివర్ణిస్తున్నాయి.

Ahmadi
Iran singer hijab punishment
74 lashes verdict
Iran music ban
Human rights violations Iran
YouTube music video controversy

More Telugu News